హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు పరిశ్రమల రంగంలో పరస్పర వైరుధ్యం ఉన్న పోటీదారులు కాదని, ఒకే పారిశ్రామిక వాల్యూ చైన్ లో కీలక అర్ధభాగాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. తెలంగాణకు సైతం ప్రత్యేకమైన వనరులు, శక్తులున్నాయి. అందుకే పూర్తి రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త భాగస్వామ్యాన్ని ప్రతిపాదించేందుకే వచ్చామన్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ సదస్సును పురస్కరించుకుని శుక్రవారం బెంగళూరులోని ఆర్టీజియా హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. ఏరోస్పేస్, వ్యాక్సిన్లు, చిప్స్, టెక్స్టైల్స్ రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయమని మంత్రి తెలిపారు. కర్నాటక, తెలంగాణ, యావత్ భారతదేశం కోసం కలిసి నిర్మిద్దాం’’ అని ఆయన పిలుపునిచ్చారు.
